Wednesday, February 6, 2008

ఆరు బయట వాకిట్లో వేప చెట్టు క్రింద నాన్నగారి వాలు కుర్చి తెచ్చుకుని పిల్లగాలుల్నాస్వాదిస్తూ సేదదేరుతూన్న వేళ, నా ప్రక్కనే సగం తిని నేలపై వదిలేసిన జామపండును ఎక్కదినుండో చూసి వచ్చిన ఉడుత, నన్ను చూసి సందేహిస్తూ ఆగి పోయింది. కనకాంబరం మొక్కపై ఓ చిన్ని పక్షి గూడు కట్టుకొని బయటకు,లోనికి వెళుతూ హడావుడి పదిపోతూంది. ఇంటి వెనకాల తాటి చెట్ల మద్య నుండి అస్తమించే సూరీడు సంధ్యారుణ కాంతుల్ని వెలువరిస్తూ యింటికేగే తొందరలో ఉన్నాడు. వీటన్నిటినీ చూస్తూ మైమరచిపోతూన్న నాకు రోజూ కనిపించే మరో ద్రుశ్యం మళ్ళీ సాక్షాత్కరించింది. సాయంసమయంలో కల్లు మండవ నుండి కల్లు తాగి వచ్చే జనం, వారి నడక, వారి పాటలుపాటలు, రోజూ చూస్తున్నవే అయినా మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తాయి. కల్లు తాగడానికి చెప్పులుకుట్టె ముత్తయ్య తాత రోజూ మా ఇంటిముందునుండే దారంట వేగంగా వెళతాడు. ఎవరేనా ఏంటి బావా ? అని పలకరిస్తే ఆగకుండా వడి వడిగా ఎక్స్ ప్రెస్ లా వెళ్ళిపోతాడు. కల్లు మండవ నుండి వచ్చేప్పుడు మాత్రం ప్రతి పది అడుగులకు ఆగి, ఆగి అందరినీ ఆపి వాగుతూ, వదరుతూ తిరిగి వస్తాడు. రోజూ ఈ ద్రుశ్యం చూడ్డం నాకలవాటయినా ప్రతి రోజూ కొత్తే - ప్రతి రోజూ వింతే. ఇప్పటికీ ఈ అనుభూతులు పదిలంగా మదినిండా బద్రంగా ఉన్నాయి.

No comments: